పశ్చిమ రాష్ట్రాల బహాయిలకు వెలువరించిన  దివ్యఫలకము (#13727)

[యునైటెడ్ స్టేట్స్ కు చెందిన పదకొండు పశ్చిమ రాష్ట్రాలు: న్యూ మెక్సికో, కొలరాడో, అరిజోనా, నెవాడ, కాలిఫోర్నియా, వయోమింగ్, యూటా, మంటానా, ఐడహో, ఓరెగన్, వాషింగ్టన్ ల నివాసుల నుద్దేశించి 1916సం. ఏప్రిల్ 1న బహజీ సౌధంలోని అబ్దుల్-బహా గదిలో దీనిని వెలువరించడం జరిగింది.] 
 ఆయన భగవంతుడు!	
ఓ దివ్యసామ్రాజ్య నందినీ, నందనులారా: 
 
నా హృదయాంతరాళమునుండి మిత్రుల పక్షాన ప్రార్థిస్తూ, భగవంతుని దివ్యసామ్రాజ్యానుగ్రహము నర్ధిస్తూ, పవిత్రాత్మ నిగూఢాలాపముల ప్రత్యక్షప్రభావమును యాచిస్తూ, వారిని గుర్తు చేసుకొనుట తప్ప రేయింబవళ్లూ నా కింకొక వ్యాపకము లేదు. పరమపూజ్యుడైన వదాన్యతాధీశుని ఆశీస్సులతో, ఆ సమయములో ఆత్మలకు భగవన్మిత్రులు జీవశ్వాస నందిస్తూ మానవకోటి మనోచైతన్యమునకు నిగూఢహేతువు కాగలరను ఆశతో ఉన్నాను; తత్ప్రశంసనీయ పర్యవసానములు మానవాళి వైభవమునకూ, మహదానందమునకూ శాశ్వతప్రయోజనకరములగు గాక. కాలిఫోర్నియా, ఓరెగన్, వాషింగ్టన్, కొలరాడో వంటి పశ్చిమ రాష్ట్రములు కొన్నింటిలో పవిత్రతా సౌరభములు పరివ్యాపితములై, నిత్యజీవనస్రవంతినుండి పలువురు భాగమునొంది, భగవత్కృపకు పాత్రులై, దైవానురాగమదిరతో పొంగులు వారెడు కలశమునుండి సేవన మొనరించి మహోన్నత దివ్యగణమాధురి నాలించినారు. భగవంతుని ప్రేమజ్యోతిని న్యూ మెక్సికో, వయోమింగ్, మంటానా, ఐడహో, యూటా, అరిజోనా, నెవాడ రాష్ట్రాలలో సముచిత, సానుకూల విధానమున ప్రజ్జ్వలన మొనరించుట ఇంకనూ జరుగలేదు, భగవంతుని దివ్యసామ్రాజ్యాహ్వానము నెలుగెత్తి ఘోషించుట జరుగలేదు. వీలైతే, ఈ దిశగా ఇప్పుడు కృషి చేయండి. ఆ రాష్ట్రాలలో వ్యక్తిగతంగా మీరైనా పర్యటించండి, కానియెడల ఇంకెవరినైనా ఎంపికచేసి పంపిన పక్షంలో, వారు వారికి బోధించగలరు. ప్రస్తుతమున కారాష్ట్రములు మృతదేహములవలె నున్నవి: వారు వాటికి జీవశ్వాస నందించి, దివ్యస్ఫూర్తిని ప్రసాదింపవలె. తారలవలె వా రాదిఙ్మండలమున ప్రకాశింప వలె, ఆవిధముగా దివ్యవాస్తవికతా సూర్యకిరణములు ఆ రాష్ట్రములను సైతము జ్యోతిర్మయ మొనరింపవచ్చును. 
మహనీయ ఖురాన్‌లో భగవంతుడు ఇలా వచిస్తున్నాడు: “నమ్మినవారికి, నిక్కముగా భగవంతుడు సహాయకుడే. ఆయన వారిని చీకటినుండి వెలుగులోనికి నడిపించును.”1 దాని అర్ధం: విశ్వాసులను భగవంతుడు ప్రేమిస్తాడనీ; కనుక, ఆయన వారిని చీకటినుండి విముక్తిచేసి, తేజోమయ ప్రపంచంలోనికి కొనితెస్తాడనీ. 
పావన సువార్తలో సైతం: “మీరు ప్రపంచమంతటా పర్యటించి ప్రజలను దేవుని రాజ్యానికి పిలవం,”2 డని చెప్పనైనది. మీరు ఉద్యమించి, ఈ మహత్తరసేవ నందించి, పలువురికి మార్గదర్శన కారకులు కావలసిన తరుణమిది. ఆ విధంగా ఈ మానవాతీతసేవతో - సమస్తప్రాంతములనూ సేవాసఖ్యతా కిరణములు శోభింప చేయగా, మానవప్రపంచము శాంతినీ, ఆత్మస్థైర్యమునూ పొందవచ్చును.
నేను అమెరికాలో ఉండగా, ప్రతి సమావేశంలోనూ విశ్వశాంతి సిద్ధాంతముల ప్రచార నిమిత్తం యెలుగెత్తి చాటి, ప్రజలకు పిలుపును ఇవ్వనైనది. ఐరోపా ఖండము ఆయుధాగారము వలె అయినదనీ, భీషణాగ్నికది ఆహుతి యగుట కేవల మొక్క అగ్నికణముపై ఆధారితమై ఉన్నదనీ, రానున్న కాలంలో, అనగా రెండు మూడేళ్లలో యోహాను ప్రకటనగ్రంథంలోనూ, దానియల్ గ్రంథంలోనూ ప్రస్తావితమైన దెల్లయూ నెరవేరుననీ, సాకారమగుననీ నేను స్పష్టముగా చెప్పనైనది. ఈ అంశము అక్టోబర్ 12, 1912 నాటి శాన్‌ ఫ్రాన్సిస్కో బులెటిన్ లో ప్రచురితమైనట్లున్నది. మీరు దానిని చూసినచో, వాస్తవము స్పష్టమూ, సువిదితమూ అవుతుంది; ఆ విధముగా, సుపరిమళ పరివ్యాపనా సమయ మిదియేనని సంపూర్ణముగా తెలిసికొనవచ్చును. 
మానవుని ఔదార్యము భగవత్సంబంధితమై ఉండవలె, వేరొక తీరున చెప్పవలెనంటే, అది దైవానుగ్రహ సాహాయ్యము నందుకొనుచూ ఉండవలె తద్వారా, మనుష్య ప్రపంచమున కాతడు చైతన్యహేతువు కాగలడు.
మీకు ప్రశంసాభినందనలు!

-`Abdu'l-Bahá
-----------------------

